Manmohan Singh: అనారోగ్యంతో ఉన్నా బాధ్యతను మరువని మన్మోహన్.. నాడు వీల్ చెయిర్ లో రాజ్యసభకు వెళ్లిన వైనం
- 2023లో ఢిల్లీ సర్వీస్ బిల్లును తెచ్చిన మోదీ సర్కార్
- అప్పటికే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధాని
- పెద్దగా ప్రయోజనం లేదని తెలిసీ బాధ్యతగా సభకు వచ్చారన్న మోదీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి తుదిశ్వాస వదిలిన విషయం తెలిసిందే. దేశానికి సుదీర్ఘకాలంపాటు వివిధ హోదాలలో సేవలందించిన మన్మోహన్ సింగ్ బాధ్యతకు, విధినిర్వహణలో ఆయన చూపే కచ్చితత్వానికి తార్కాణంగా నిలిచే సంఘటన 2023 లో చోటుచేసుకుంది. గతేడాది ఆగస్టు 7న కేంద్రంలోని మోదీ సర్కారు ఢిల్లీ సర్వీసెస్ బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ప్రతిపక్షాలు అన్నీ వ్యతిరేకించాయి.
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేయడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించాయి. బిల్లుపై ఓటింగ్ జరగాలంటూ పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభలలో ఓటింగ్ జరిగింది. నాడు మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇండియా కూటమి పిలుపు మేరకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడానికి వీల్ చెయిర్ లోనే సభకు వచ్చారు. అప్పటికే అనారోగ్యంతో వుండి, నడిచే పరిస్థితి లేనప్పటికీ సభకు వచ్చి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు.
రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మెజారిటీ ఉందని తెలిసి, తాను ఓటేసినా పెద్దగా ప్రయోజనం లేదని తెలిసీ మన్మోహన్ సభకు రావడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ నాడు సభలో ప్రస్తావిస్తూ.. రాజ్య సభ సభ్యుడిగా తన బాధ్యతను నిర్వహించేందుకు వీల్ చెయిర్ లో సభకు వచ్చిన మన్మోహన్ సింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం మాటే నెగ్గుతుందని మన్మోహన్ సింగ్ కు తెలుసని, అయినా బాధ్యతగా వచ్చి ఓటేసి సభ్యులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ కోలుకుని తామందరికీ మార్గదర్శకం చేయాలంటూ సభలో మోదీ ప్రార్థించారు.