Manmohan Singh: ‘మౌన ప్రధాని’గా మన్మోహన్ సింగ్‌పై విపక్షాల ముద్ర.. పదవి నుంచి దిగిపోయాక ఇచ్చిన సమాధానం ఇదే

People say I was a silent Prime Minister but i met press regularly says Manmohan Singh

  • మీడియాతో మాట్లాడడానికి భయపడిన ప్రధానిని కాదన్న మన్మోహన్
  • విదేశీ పర్యటనల సమయంలో ప్రతిసారీ ప్రెస్‌తో మాట్లాడానంటూ 2018లో స్పందన
  • ‘ఛేంజింగ్ ఇండియా’ పుస్తకావిష్కరణలో మన్మోహన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశ ఆర్థిక వ్యవస్థ సంస్కర్త, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుసగా రెండు పర్యాయాలు ప్రధానిగా చిరస్మరణీయ సేవలు అందించారు. అయితే, ఆయన పదవిలో కొనసాగినంత కాలం ‘మౌనముని’, ‘మౌన ప్రధాని’ అంటూ ప్రతిపక్షాలు విమర్శించేవి. ఈ తరహా వ్యాఖ్యలను పట్టించుకోకుండా దేశాభివృద్ధిలో ఆయన తనదైన బలమైన ముద్ర వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలోనే ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పదవి నుంచి దిగిపోయిన నాలుగేళ్ల తర్వాత 2018లో తొలిసారి మౌనముని విమర్శలపై స్పందించారు. ఆరు సంపుటాలుగా ఆయన రచించిన ‘ఛేంజింగ్ ఇండియా’ పుస్తకావిష్కరణలో మాట్లాడారు.

ప్రెస్‌తో మాట్లాడడానికి భయపడే ప్రధానిని కాదు
‘‘నన్ను మౌన ప్రధాని అన్నారు. వాస్తవాలు ఏమిటో ఈ పుస్తకాలు తెలియజేస్తాయని భావిస్తున్నాను. ప్రెస్‌తో మాట్లాడటానికి భయపడిన ప్రధానమంత్రిని కాదు. నేను క్రమం తప్పకుండా మీడియాతో మాట్లాడాను. నేను చేపట్టిన ప్రతి విదేశీ పర్యటన సమయంలో మీడియాతో మాట్లాడాను. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లలో పాల్గొన్నాను. వాటి ఫలితాలను కూడా పుస్తకంలో వివరించాను’’ అని మన్మోహన్ సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు.

కాగా, 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో దశాబ్ద కాలం పాటు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కొనసాగారు. అంతకుముందు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా కూడా చిరస్మరణీయ సేవలు అందించారు. 1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రపంచ మార్కెట్‌లో భారత ఆర్థిక వ్యవస్థను ఒక భాగంగా మార్చివేశారు. దీంతో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి వృద్ధిబాట పట్టింది. అందుకే ఆధునిక భారతదేశ ఆర్థిక రూపశిల్పిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు.

  • Loading...

More Telugu News