Bhanuprakash Reddy: వైసీపీ హయాంలో టీటీడీకి చెందిన వందల కోట్లు దోచుకున్నారు: భానుప్రకాశ్ రెడ్డి
- వైసీపీ హయాంలో గుడిని, గుడిలోని లింగాన్ని కూడా మింగేశారన్న భానుప్రకాశ్ రెడ్డి
- టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేశారని మండిపాటు
- మన ఆలయాలను మనమే కాపాడుకోవాలని పిలుపు
వైసీపీ హయాంలో గుడిని, గుడిలోని లింగాన్ని సైతం మింగేశారని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. దీనికి తిరుమల పరకామణిలో జరిగిన చోరీ ఘటన నిదర్శనమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో కొందరు పెద్దలు టీటీడీకి చెందిన వందల కోట్లు దోచుకున్నారని ఆన్నారు. తిరుమలలో జరిగిన దోపిడీపై విచారణ జరిపించాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం దేవాలయాల వ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు. విగ్రహాలపై దాడి చేశారని మండిపడ్డారు. రథాలను సైతం తగలబెట్టిన ఘటనలు జరిగాయని చెప్పారు. టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.
మన ఆలయాలను మనమే కాపాడుకోవాలని చెప్పారు. ఆలయాలకు చెందిన ఒక్క రూపాయి నిధులను కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోకూడదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని తెలిపారు. జనవరి 5న విజయవాడలో శంఖారావం కార్యక్రమం జరగనుందని... ఆ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణకు తీర్మానం చేస్తామని చెప్పారు.