Team India: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళా క్రికెట్ జట్టు
- మూడో వన్డేలో 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
- 28.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు
- ఆల్ రౌండర్ ప్రతిభతో అదరగొట్టిన దీప్తి శర్మ
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈరోజు జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళా జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ముందు కాస్తా తడబడినప్పటికీ 28.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
దీప్తిశర్మ ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచింది. 48 బంతుల్లో మూడు ఫోర్లు, 1 సిక్స్‌తో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. 31 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసింది. మరో బౌలర్ రేణుకా ఠాకూర్ 29 పరుగులు ఇచ్చి 4 పరుగులు చేసింది.
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 32 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 29 పరుగులతో రాణించారు. చివరలో రిచా ఘోష్ 11 బంతుల్లో 23 పరుగులతో చెలరేగిపోయింది. గత మ్యాచ్‌లో రాణించిన స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ మూడో వన్డేలో మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కూడా టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.