Manmohan Singh: మన్మోహన్ ఒక ఛాంపియన్: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్
- మన్మోహన్ మృతి పట్ల సంతాపం తెలిపిన అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్
- రెండు దశాబ్దాల్లో అమెరికా, భారత్ కలిసి సాధించిన వాటికి పునాది వేసింది మన్మోహనేనని వెల్లడి
- ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా భారత్ ఆయనను గుర్తుంచుకుంటుందన్న బ్లింకెన్
- సంబంధాలు బలోపేతం కావడంలో మన్మోహన్ పాత్రను అమెరికా గుర్తుంచుకుంటుందన్న బ్లింకెన్
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సంతాపం తెలిపారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఛాంపియన్‌లలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు అని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.
భారత్-అమెరికా మధ్య కొత్త తరం సంబంధాలకు పునాది వేయడంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఎంతో ఉందన్నారు. మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో అమెరికా తరఫున భారత ప్రజలకు సంతాపం తెలియజేస్తున్నామన్నారు. గత రెండు దశాబ్దాలలో మన రెండు దేశాలు కలిసి సాధించిన వాటికి పునాది వేసిన ఘనత మన్మోహన్ సింగ్‌దే అన్నారు. అమెరికా-భారత్ మధ్య పౌర అణు ఒప్పందం ముందుకు వెళ్లడంలో ఆయన కృషి ఉందన్నారు.
ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్‌ను భారతదేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మరింత దృఢంగా కావడంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఉందని, ఆయనను అమెరికా ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.