Manmohan Singh: రేపు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు: కేంద్ర హోంశాఖ

Manmohan Singh funeral at Nigambodh Ghat on Saturday says MHA

  • ఉదయం.11.45 గంటలకు నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంతిమ సంస్కారాలు
  • సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
  • ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖను కోరిన కేంద్ర హోంశాఖ

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రేపు ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరుగుతాయని తెలిపింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కోరినట్టు ఈ మేరకు ఓ ప్రకటనలో కేంద్ర హోంశాఖ తెలిపింది.

కేంద్ర కేబినెట్ సంతాపం

మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సంతాప తీర్మానం చేసింది. మన్మోహన్‌ సింగ్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. వచ్చే నెల 1వ తేదీ వరకు ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఈ 7 రోజులపాటు దేశవ్యాప్తంగా, విదేశాల్లోని ఇండియన్ మిషన్స్, రాయబార కార్యాలయాల్లో జాతీయ జెండాను సగం వరకు ఎగురవేయనున్నారు. అంత్యక్రియల రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు హాఫ్ డే సెలవు ప్రకటించారు.

స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

మన్మోహన్ సింగ్‌కు అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని కోరారు. దేశానికి రెండుసార్లు ప్రధానిగా సేవలు అందించిన ఆయన స్మారక స్థలం ఏర్పాటుపై ఉదయం ప్రధానితో ఖర్గే ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ఈ అంశంపై రెండు పేజీల లేఖను రాశారు. రాజనీతిజ్ఞులు, మాజీ ప్రధానమంత్రులకు అంత్యక్రియలు జరిగిన స్థలంలో వారి స్మారకాలను నిర్మించిన సంప్రదాయాన్ని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News