Current Shock: డాబాపై ఫోన్ మాట్లాడుతూ కరెంట్ తీగను పట్టుకున్న బాలుడు.. షాక్ తో మృతి
--
నల్గొండ జిల్లాలో పదో తరగతి బాలుడు విద్యుత్ షాక్ కు గురై చనిపోయాడు. డాబాపైన నిలుచుని ఫోన్ మాట్లాడుతూ పొరపాటున విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. దీంతో షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గుర్రంపొడు మండలం మక్కపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నేతళ్ల కిరణ్ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొండమల్లేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు రోజూ వెళ్లి వస్తాడు.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఫోన్ రావడంతో డాబాపైకి వెళ్లి మాట్లాడుతున్నాడు. పరధ్యానంలో డాబా పక్కనే ఉన్న విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. షాక్ తగలడంతో స్పాట్ లోనే చనిపోయాడని కిరణ్ కుటుంబ సభ్యులు తెలిపారు. కిరణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.