Australia vs India: బాక్సింగ్ డే టెస్టు.. ముగిసిన మూడోరోజు ఆట.. సెంచరీతో ఆదుకున్న నితీశ్ రెడ్డి
- మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆసీస్ నాలుగో టెస్టు
- మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 358/9
- అజేయ శతకం (105 నాటౌట్) తో రాణించిన నితీశ్ రెడ్డి
- తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 474 రన్స్‌కు ఆలౌట్
- ఆసీస్ కంటే ఇంకా 116 పరుగుల వెనుకంజలో భారత్
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మూడోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి అజేయ శతకం (105 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50)తో కలిసి 127 పరుగుల భాగస్వామ్యం అందించాడు.
ఇక ఓవర్‌నైట్ స్కోర్ 164/5 తో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్‌కు రిషభ్ పంత్ (28), రవీంద్ర జడేజాను స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపించి ఆసీస్ పైచేయి సాధించింది. దీంతో టీమిండియా 221 పరుగులకే 7 వికెట్లు పారేసుకుంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బౌలింగ్ ఆల్‌రౌండర్ సుందర్‌తో కలిసి నితీశ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.
భారత్‌ను ఫాలో-ఆన్ గండం నుంచి కాపాడడంతో పాటు భారీ స్కోర్ సాధించేలా చేశాడు. ఈ క్రమంలో తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. మరికొద్దిసేపట్లో ఆట ముగుస్తుందనగా వర్షం అంతరాయం కలిగించింది. ఎంతకూ వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
మూడోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 358/9 స్కోర్ చేసింది. క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి (105), మహ్మద్ సిరాజ్ (02) ఉన్నారు. ఆసీస్ కంటే భారత్ ఇంకా 116 రన్స్ వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, బొలాండ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ నాథన్ లైయన్ 2 వికెట్లు తీశాడు. కాగా, ఆతిథ్య జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.