Pranab Mukherjee: నా తండ్రి చనిపోతే సీడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించలేదు: కాంగ్రెస్‌పై ప్రణబ్ కూతురు ఆగ్రహం
- నా తండ్రికి సీడబ్ల్యూసీ నివాళులు అర్పించలేదని మండిపాటు
- ఈ విషయంలో కాంగ్రెస్ నేత తనను తప్పుదోవ పట్టించారని ఆరోపణ
- రాష్ట్రపతులకు నివాళులు అర్పించే సంప్రదాయం లేదని చెప్పారని విమర్శ
తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు ఆయనకు నివాళులు అర్పించేందుకు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించలేదని ప్రణబ్ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అంత్యక్రియలు నిర్వహించిన చోట స్మారకస్థలం నిర్మించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని కోరారు.
ఈ నేపథ్యంలో శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్ అధిష్ఠానంపై ఎక్స్ వేదికగా మండిపడింది. మాజీ రాష్ట్రపతి, తన తండ్రి ప్రణబ్ 2020లో మృతి చెందారని, సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు.
రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీలోని ఓ సీనియర్ నేత తనను నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. అయితే తన తండ్రి డైరీని చదివిన తర్వాత అది నిజం కాదని తెలిసిందన్నారు. కేఆర్ నారాయణన్‌కు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించినట్లు డైరీలో ఉందన్నారు.