Team India: నాలుగో టెస్టులో ఓడినా లేదా డ్రాగా ముగిసినా.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కి వెళ్లాలంటే.. సమీకరణాలు ఇలా!
- ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో సఫారీలు
- రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఆసీస్, భారత్
- బీజీటీ సిరీస్‌ను 3-1 తేడాతో గెలిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కి భారత్
- ఒకవేళ రోహిత్ సేన ఈ మ్యాచులో ఓడిన లేదా డ్రాగా ముగిసిన మనకు ఛాన్స్
- పాక్, దక్షిణాఫ్రికా సిరీస్.. శ్రీలంకతో ఆస్ట్రేలియా ఆడే సిరీస్ ఫలితాల ద్వారా నిర్ధారణ
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య జట్టుకు టీమిండియా దీటుగానే బదులిస్తోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి అజేయ శతకం (105 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50)తో కలిసి 127 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించాడు.
ఎనిమిది, తొమ్మిది స్థానాలలో బ్యాటింగ్‌కి వచ్చిన ఈ ద్వయం అద్భుతమైన పోరాటపటిమ, సమన్వయంతో ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. రెండో రోజు ఆట తర్వాత ఈ మ్యాచ్ భారత్ చేయి దాటిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ, మూడోరోజు నితీశ్, సుందర్ జోడీ అద్భుతంగా ఆడి, మ్యాచ్‌ను దాదాపు కాపాడారు. దాంతో భారత అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే... ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు ఎంతో కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కి వెళ్లాలంటే ఆసీస్, భారత్‌కు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంటే... ఆస్ట్రేలియా, భారత్ వరుసగా రెండు, మూడో స్థానంలో ఉన్నాయి. ఇక భారత్ ప్రస్తుతం జరుగుతున్న బీజీటీ సిరీస్‌ను 3-1 తేడాతో గెలిస్తే, ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కి వెళుతుంది.
ఒకవేళ రోహిత్ సేన ఈ మ్యాచ్ లో ఓడినా లేదా డ్రాగా ముగిసినా కూడా మనకు డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ, దానికోసం ఇతర జట్లు ఆడే రెండు టెస్టు సిరీస్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అవి... ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్, దక్షిణాఫ్రికా సిరీస్ ఒకటి, త్వరలో శ్రీలంకతో ఆస్ట్రేలియా ఆడే సిరీస్ మరోకటి... ఈ టెస్టు సిరీస్ ల ఫలితాలు కీలకం కానున్నాయి.
ఈ రెండు సిరీస్‌ల ఫలితాల ఆధారంగా టీమిండియా ఫైనల్‌కి వెళ్లేందుకు కావాల్సిన సమీకరణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం...
- * ఇదివరకు చెప్పినట్టు బీజీటీలో భారత్ 3-1తో గెలిస్తే నేరుగా ఫైనల్‌కి వెళుతుంది.
- * ఒకవేళ భారత జట్టు 2-1తో గెలిస్తే... ఆసీస్‌తో జరిగే రెండు మ్యాచ్ ల సిరీస్‌లో శ్రీలంక తప్పనిసరిగా ఒక మ్యాచ్ డ్రా చేయాల్సి ఉంటుంది. లేదా దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ రెండు మ్యాచ్ ల సిరీస్‌ను గెలవాల్సిందే.
- * ఒకవేళ టీమిండియా 2-2తో సమం చేసిన పక్షంలో శ్రీలంక తప్పనిసరిగా ఆసీస్‌ను ఓడించాల్సి ఉంటుంది. లేదా దక్షిణాఫ్రికాపై పాక్ 2-0 తేడాతో సిరీస్ విజయం సాధించాలి.
- * ఒకవేళ భారత్ 1-1 తో సమం చేస్తే... ఆస్ట్రేలియాను శ్రీలంక 1-0 తేడాతో ఓడించాలి. లేదా పాకిస్థాన్.. సఫారీలపై 2-0తో సిరీస్ గెలవాలి.
- * ఒకవేళ భారత్ బీజీటీ సిరీస్‌ను కోల్పోతే మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్లే. అప్పుడు ఆసీస్, దక్షిణాఫ్రికా ఫైనల్‌కి వెళతాయి.