Anna University rape case: అన్నా యూనివర్సిటీ ఘటనపై మహిళా అధికారులతో సిట్ ఏర్పాటుకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
- ముగ్గురు అధికారిణులతో సిట్ ఏర్పాటు చేయాలన్న మద్రాస్ హైకోర్టు
- బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
- బాధిత విద్యార్థిని చదువు ప్రభావం కాకుండా చూడాలన్న హైకోర్టు
తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం తీరును నిరసిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు. తాజాగా, ఈ అత్యాచార ఘటనపై దర్యాఫ్తు కోసం మహిళా పోలీస్ అధికారులతో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అలాగే, బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు.
మరోవైపు, ఈ కేసు దర్యాఫ్తును సీబీఐకి బదిలీ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణ్యం, జస్టిస్ వి.లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపింది.
అనంతరం, కేసు దర్యాఫ్తు కోసం ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఘటన నేపథ్యంలో బాధిత విద్యార్థిని చదువు ప్రభావితం కాకుండా చూడాలని సూచించింది. అన్నా యూనివర్సిటీ బాధిత మహిళ నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.