Azerbaijan Plane Crash: అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదంపై క్షమాపణ చెప్పిన పుతిన్

Putin apologises Azerbaijan president for plane crash

  • ఇటీవల ప్రమాదానికి గురైన అజార్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం
  • 38 మంది దుర్మరణం
  • గ్రోజ్నీ నగరంలో ల్యాండయ్యేందుకు విఫలయత్నం చేసిన విమానం
  • మరో ఎయిర్ పోర్టులో దిగే ప్రయత్నంలో కూలిపోయిన వైనం
  • అజర్ బైజాన్ అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడిన పుతిన్

అజార్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఇటీవల కజకిస్థాన్ లో కూలిపోయిన సంగతి తెలిసిందే. రష్యా అధీనంలోని గ్రోజ్నీ నగరంలో ల్యాండయ్యేందుకు ప్రయత్నించిన ఆ విమానం... సాధ్యం కాకపోవడంతో అక్తావు ఎయిర్ పోర్టులో దిగే క్రమంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 38 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ విమాన ప్రమాదానికి కారణం మీరేనంటూ రష్యా, ఉక్రెయిన్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. 

ఈ నేపథ్యంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ కు క్షమాపణ చెప్పారు. విమాన ప్రమాద సమయంలో గ్రోజ్నీ నగరంలో నెలకొన్న పరిస్థితులను పుతిన్ ఫోన్ ద్వారా వివరించారు. 

గ్రోజ్నీపై ఉక్రెయిన్ డ్రోన్లు ముమ్మరంగా దాడులు చేస్తుండడంతో, తమ గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశామని వెల్లడించారు. ఈ కారణం వల్లనే అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం గ్రోజ్నీ నగరంలో కిందికి దిగలేకపోయిందని వివరించారు. ఆ సమయంలో తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఉక్రెయిన్ డ్రోన్ దాడులను తిప్పికొడుతూ చురుగ్గా పనిచేస్తున్నాయని పుతిన్ తెలిపారు. 

అయితే, ఆ విమానం కూలిపోవడానికి రష్యా దాడులే కారణమా అనేది మాత్రం పుతిన్ స్పష్టం చేయలేదు. ఆ విమానం రష్యా గగనతలంలోనే ప్రమాదానికి గురైందన్న అంశాన్ని మాత్రం అంగీకరించారు. 

అందుకు, అజర్ బైజాన్ అధ్యక్షుడు అలియేవ్ స్పందిస్తూ... అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల విమానం రష్యా గగనతలంలో ఉన్నప్పుడు బాహ్య భౌతిక, సాంకేతిక అవరోధాలను ఎదుర్కొందని పరోక్షంగా రష్యాను నిందించారు. దాంతో తమ విమానం పూర్తిగా నియంత్రణ కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రయాణికులకు గాయాలైన తీరు, విమాన శకలాలను పరిశీలిస్తే 'బయటి నుంచి దూసుకొచ్చిన వస్తువులు' ఈ ప్రమాదానికి కారణమని అర్థమవుతోందని అలియేవ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News