twin brothers: భలే బ్రదర్స్.... చోరీలు చేస్తూ పోలీసులకు మస్కా కొడుతున్న కవలలు!
- మధ్యప్రదేశ్లో చోరీలు చేస్తూ చాకచక్యంగా తప్పించుకుంటున్న కవల సోదరులు
- భలే బ్రదర్స్ ఆట కట్టించిన మౌగంజ్ సిటీ పోలీసులు
- సోదరుడు సౌరభ్ వర్మ అరెస్టుతో పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయిన సంజీవ్ వర్మ
కొన్నేళ్లుగా వరుస దొంగతనాలు చేస్తూ చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న భలే బ్రదర్స్ (కవల సోదరులు) ఆట కట్టించారు మధ్యప్రదేశ్లోని మౌగంజ్ సిటీ పోలీసులు. సౌరభ్ వర్మ, సంజీవ్ వర్మ దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒకరు దొంగతనాలు చేస్తే, మరొకడు వేరేచోట చక్కర్లు కొడుతూ ఆ సీసీ టీవీ పుటేజీ చూపించి తప్పించుకుంటారు. వీరిద్దరూ కవలలు అనే విషయం ఆ గ్రామస్తులకు తప్ప బయటి వ్యక్తులకు పెద్దగా తెలియదు.
అందుకే వీరు ఎవరూ గుర్తు పట్టకూడదనే ఉద్దేశంతో కలిసి ఎక్కడికీ వెళ్లరు. ఒకేలాంటి దుస్తులు ధరించడం, ఆహార్యంతో ఇంతకాలం మేనేజ్ చేస్తూ వచ్చారు. సౌరభ్ వర్మ దొంగతనాలు చేయడంలో ఆరితేరగా, సంజీవ్ వర్మ పోలీసులను తప్పుదోవ పట్టించడంలో ఆరితేరాడు. అయితే, ఈ నెల 23న మౌగంజ్ సిటీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించి నగలు, నగదు దోచుకెళ్లారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
వీరిలో సౌరభ్ వర్మ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోదరుడి కోసం సంజీవ్ వర్మ పోలీస్ స్టేషన్కు వచ్చాడు. సంజీవ్ వర్మను చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. లోపల ఉన్న నిందితుడు బయటకు ఎలా వచ్చాడో తెలియక ఆశ్చర్యపోయారు. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా, తాము కవల సోదరులమని అసలు విషయం బయటపెట్టారు. వారి వద్ద నుంచి లక్షలాది రూపాయల దోపిడీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.