Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
- మెల్బోర్న్ టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ
- భారత్ లో ఎక్కడ్నించి వచ్చావన్నది ముఖ్యం కాదన్న పవన్
- భారత్ కోసం ఏం చేశావన్నదే ముఖ్యమని వెల్లడి
- ఇదే ఒరవడి కొనసాగించాలని ఆకాంక్ష
జట్టు కష్టాల్లో ఉన్న వేళ టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి నమోదు చేసిన సూపర్ సెంచరీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"భారత్ లో నువ్వు ఎక్కడ్నించి వచ్చావన్నది కాదు... భారత్ కోసం ఏం చేశావన్నదే ముఖ్యం. నువ్వు మన భారత్ గర్వించేలా చేశావు. డియర్ నితీశ్ కుమార్ రెడ్డీ... భారత్ తరఫున ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించావు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రఖ్యాత మెల్బోర్న్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో 114 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడడం ద్వారా నీ అద్వితీయమైన ప్రతిభను ఘనంగా ప్రదర్శించావు.
భారత కీర్తి పతాకను మరింత ఎత్తులకు తీసుకెళ్లేలా.... నువ్వు ఇలాగే ఆడుతూ మరిన్ని వరల్డ్ క్లాస్ రికార్డులను నమోదు చేస్తావని భావిస్తున్నాను. ఆట పట్ల నీ తపన, దృఢసంకల్పంతో కుర్రకారుకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ఈ సిరీస్ ను గెలిచి భారత్ విజయవంతంగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.
నితీశ్ రెడ్డి మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి 189 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ తో 114 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో అవుటయ్యాడు.