Nara Bhuvaneswari: నితీశ్ కుటుంబం భావోద్వేగ క్షణాలపై నారా భువనేశ్వరి స్పందన
- ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత సెంచరీ నమోదు చేసిన తెలుగుతేజం నితీశ్
- టీమిండియాను మ్యాచ్ లో నిలిపిన నితీశ్ శతకం
- యువ క్రికెటర్ పై సర్వత్రా ప్రశంసల వర్షం
- అతడు సాధించిన ఘనత చిన్నదేమీ కాదన్న భువనేశ్వరి
- తల్లిదండ్రుల త్యాగాలకు తగిన నజరానా ఇచ్చాడని కితాబు
తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన సెంచరీ అందరినీ ఆకట్టుకుంది. తండ్రి కలను నెరవేరుస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నితీశ్ కుమార్ రెడ్డి... మెల్బోర్న్ టెస్టులో సెంచరీ ద్వారా తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.
నిన్న మూడో రోజు ఆట ముగిసిన అనంతరం నితీశ్ ను అతడి తల్లిదండ్రులు, సోదరి హోటల్ కు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య భావోద్వేగాలు ఉప్పొంగాయి. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్టు చేయగా... దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. కుటుంబ సభ్యుల మధ్య మధుర క్షణాలను ఈ అందమైన వీడియోలో చక్కగా ఒడిసిపట్టారని ఆమె ట్వీట్ చేశారు.
"మన యువ తార నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీ పట్ల అందరం గర్విస్తున్నాం. అతడు సాధించిన ఘనత చిన్నదేమీ కాదు. తద్వారా తన కుటుంబాన్ని గర్వించేలా చేశాడు. కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలకు తన సెంచరీ ద్వారా తగిన నజరానా అందించాడు. బిడ్డ కలను నిజం చేయడానికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూ ప్రతి దశలోనూ తోడుగా ఉన్న అతడి తల్లిదండ్రులకు శుభాభినందనలు.
అంతేకాదు, అతి పెద్ద కుటుంబంగా పేర్కొనే మనందరి తెలుగు సమాజాన్ని నితీశ్ గర్వపడేలా చేశాడు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా విజయ ప్రస్థానం కొనసాగించాలని కోరుకుంటున్నాను" అంటూ నారా భువనేశ్వరి దీవెనలు అందజేశారు. అంతేకాదు, బీసీసీఐ పోస్టు చేసిన వీడియోను కూడా ఆమె షేర్ చేశారు.