Dil Raju: సినీ పరిశ్రమను అనవసర వివాదాల్లోకి లాగొద్దు: కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్ రాజు రియాక్షన్

Dil Raju replies to KTR comments on cinema celebs meeting with CM Revanth Reddy
  • ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
  • సినిమా వాళ్లతో సెటిల్ చేసుకున్నాక సీఎం సైలెంట్ అయ్యాడన్న కేటీఆర్
  • సినీ పరిశ్రమకు లేనిపోని రాజకీయాలు ఆపాదించవద్దన్న దిల్ రాజు
  • కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని వెల్లడి
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు, ప్రచారం కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి సినిమా వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడని... అయితే సినిమా వాళ్లతో వ్యవహారం సెటిల్ చేసుకున్నాక ఇప్పుడేమీ మాట్లాడడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తీవ్రంగా స్పందించారు. 

ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశంపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. చిత్ర పరిశ్రమను అనవసర వివాదాల్లోకి లాగొద్దని స్పష్టం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు లేనిపోని రాజకీయాలు అంటగట్టడం సరికాదని అన్నారు. రాజకీయ విమర్శలు, రాజకీయ దాడులు-ప్రతిదాడులకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దని దిల్ రాజు స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం చాటుమాటు వ్యవహారమేమీ కాదని తెలిపారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, బాగోగులపై స్నేహపూర్వకంగా చర్చ సాగిందని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందని వివరించారు. 

రాష్ట్రాభివృద్ధిలో చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. సామాజిక సంక్షేమం కోసం చిత్ర పరిశ్రమ నుంచి సహకారం కావాలని ముఖ్యమంత్రి కోరారని దిల్ రాజు తెలిపారు.
Dil Raju
KTR
Tollywood
Revanth Reddy
Sandhya Theater Issue
Hyderabad
Congress
BRS
Telangana

More Telugu News