Harish Rao: 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలే ఎక్కువ: హరీశ్ రావు

Harish Rao fires at Congress government

  • అభయ హస్తం ప్రజలను భయపెట్టే హస్తంగా మారిందని ఎద్దేవా
  • కేసీఆర్ కిట్లు ఇస్తే రేవంత్ రెడ్డికి తిట్లు వస్తున్నాయన్న హరీశ్ రావు
  • రేవంత్ బ్రదర్స్ రాజ్యాంగేతర శక్తిగా మారారని ఆగ్రహం

2024లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్... ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ప్రజలకు కోటి ఆశలు చూపిన కాంగ్రెస్ కనీసం కూట్లో రాయి కూడా తీయలేదన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అభయ హస్తం ప్రజలను భయపెట్టే, బాధపెట్టే హస్తంగా మారిందన్నారు.

ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఏడాది దాటినా చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలన తర్వాత అనేక సర్వే ఏజెన్సీలు ప్రజల మూడ్‌ను తెలుసుకునే ప్రయత్నం చేశాయని, కానీ ఏ సర్వేలోనూ రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ అమలు చేసే బదులు... డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు.

కేసీఆర్ హయాంలో ప్రజలకు కిట్లు ఇస్తే... ఇప్పుడు రేవంత్‌కు తిట్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు బోగస్ మాటలు చెప్పారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు కమీషన్ల మీద ధ్యాసే తప్ప కమిట్‌మెంట్ లేదన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వక్రమార్గం పట్టిస్తున్నారన్నారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం పోయి అనుముల రాజ్యాంగం వచ్చిందని విమర్శించారు. అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

రేవంత్ బ్రదర్స్ రాజ్యాంగేతర శక్తులుగా మారిపోయారని మండిపడ్డారు. హైడ్రా పేరిట సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు. దీంతో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని నిప్పులు చెరిగారు. ప్రజల బతుకులు మారుస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ తల్లిని మార్చిందని విమర్శించారు. అవకాశవాదానికి రేవంత్ రెడ్డి మారు పేరుగా నిలిచిపోయాడని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల స్నేహం ఈ ఏడాది మరింత బలపడిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చిన్న రిపేర్ కూడా చేయలేదని మండిపడ్డారు. లగచర్ల ఘటనలో సీఎం భూ దందా బయటపడిందన్నారు. ఈ కేసులో అన్యాయంగా అమాయకులను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో అయినా ఫార్మా అయినా ప్రభుత్వానికి ఓ విజన్ లేదని విమర్శించారు. ఏడాదిలోనే కాంగ్రెస్ కాలకేయ అవతారం, రేవంత్ రావణాసుర రూపం బయటపడిందన్నారు.

  • Loading...

More Telugu News