Andhra Pradesh: నేడు న్యూ ఇయర్ వేడుకలు వద్దు.. ఏపీ ప్రభుత్వం ఆదేశం
- మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతికి నివాళిగా వారం రోజుల సంతాప దినాలు
- ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించవద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
- నేడు సాధారణంగా విధులకు హాజరు కావాలని అధికారులకు సూచన
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ మృతికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వారం రోజుల సంతాప దినాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని అధికారికంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని ఆదేశిస్తూ కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నేడు సాధారణంగానే విధులకు హాజరు కావాలని సాధారణ పరిపాలన శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. అధికారులు ఎప్పటిలానే కలెక్టర్లు, ఎస్పీలను కలవొచ్చని స్పష్టం చేసింది.
అయితే, కేక్ కటింగ్ లాంటి వేడుకలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఏదైనా సందేహం ఉంటే కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్, లేదంటే బ్లూ బుక్ చూసి నివృత్తి చేసుకోవాలని కోరింది. కేంద్రం ప్రకటించిన సంతాప దినాలు పూర్తయ్యే వరకు అధికారికంగా ఎలాంటి వేడుకలు కానీ, మీట్ అండ్ గ్రీట్ కాని నిర్వహించవద్దని స్పష్టం చేసింది.