Tejsvi Surya: గాయని శివశ్రీని పెళ్లాడబోతున్న కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య

BJP MP Tejasvi Surya Set To Knot The Knot With Singer Sivasri Skanda Prasad

  • గాయనిగా, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణిగా శివశ్రీకి గుర్తింపు
  • పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా కన్నడ వెర్షన్‌ పాట పాడిన శివశ్రీ
  • మార్చి 24న బెంగళూరులో వివాహం
  • దేశంలోని అత్యంత పిన్న వయస్కులైన ఎంపీలలో ఒకరిగా తేజస్వి సూర్యకు గుర్తింపు

దేశంలోనే అత్యంత పిన్నవయస్కులైన ఎంపీలలో ఒకరిగా రికార్డులకెక్కిన కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య త్వరలోనే ఒక ఇంటి వారు కాబోతున్నారు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ చేసిన శివశ్రీ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. పొన్నియన్ సెల్వన్-పార్ట్ 2 సినిమా కన్నడ వెర్షన్‌లో శివశ్రీ ఓ పాట పాడారు. ఆమె యూట్యూబ్ చానల్‌కు 2 లక్షల మందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 

తేజస్వి సూర్య వృత్తి పరంగా న్యాయవాది. ప్రస్తుతం బెంగళూరు సౌత్ నుంచి రెండోసారి ఎంపీగా కొనసాగుతున్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన సూర్య కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌పై 3.31 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. సెప్టెంబర్ 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాగా, 34 ఏళ్ల సూర్య ‘ఐరన్‌మ్యాన్ 70.3 ఎండ్యురన్స్ రేస్’ పూర్తి చేసిన తొలి సిట్టింగ్ ఎంపీగా గతేడాది రికార్డు సృష్టించారు. సూర్య, స్కంద వివాహం మార్చి 24న బెంగళూరులో జరగనుంది.
.

  • Loading...

More Telugu News