US Hotels: అమెరికా హోటళ్లలో భారతీయులకు పెరిగిన మర్యాద.. మనోళ్ల కోసం అక్కడి హోటళ్లలో టీ, సమోసా, భారతీయ టీవీ ఛానెల్స్!
- భారత పర్యాటకులను ఆకర్షించేందుకు అమెరికన్ హోటళ్ల వినూత్న పంథా
- గతేడాది అమెరికాలో పర్యటించిన 19 లక్షల మంది భారతీయులు
- 2019తో పోలిస్తే 48 శాతం వృద్ధి నమోదైందన్న ఎన్‌టీటీఓ డేటా
- విజిటింగ్, బిజినెస్ వీసాలు పెరగడం ఇందుకు కారణం
భారత పర్యాటకులను ఆకర్షించేందుకు అమెరికన్ హోటళ్లు వినూత్న పంథా అనుసరిస్తున్నాయి. టీ, సమోసా అమ్ముతున్నాయి. లాంజుల్లో భారతీయ టీవీ ఛానళ్లను పెడుతున్నాయి. యూఎస్ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ (ఎన్‌టీటీఓ) డేటా ప్రకారం 2024లో 19 లక్షల మంది భారతీయులు అమెరికాలో పర్యటించారు. 2019తో పోలిస్తే 48 శాతం వృద్ధి నమోదైంది. విజిటింగ్, బిజినెస్ వీసాలు పెరగడం ఇందుకు కారణం.
వ్యాపార సందర్శనల కోసం జారీ చేసే బిజినెస్ వీసాలు 50 శాతం పెరిగాయి. అలాగే పర్యటనల కోసం ఇచ్చే విజిటింగ్ వీసాలు 43.5 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. అందుకే అమెరికాకు మనోళ్లు భారీగా క్యూ కట్టారు. దీన్ని తమకు అనుకులంగా మార్చుకున్న అక్కడి హోటళ్లు భారతీయ పర్యాటకులను ఆకర్షించే పనిలో పడ్డాయి. హోటళ్ల లాబీలలో చాయ్, సమోసాలను పెట్టడంతో పాటు గెస్ట్ రూమ్‌లలో ప్రముఖ భారతీయ టీవీ చానెళ్ళను ప్రసారం చేస్తున్నాయని ఆసియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ సీఎం లారా లీ బ్లేక్ తెలిపారు.
మరోవైపు చైనా, జపాన్, దక్షిణ కొరియా పర్యాటకుల శాతం 50 నుంచి 25 వరకు తగ్గిపోయిందని ఎన్‌టీటీఓ డేటా వెల్లడించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గగా, దాన్ని భారతీయ టూరిస్టులు భర్తీ చేస్తున్నారని లారా లీ బ్లేక్ పేర్కొన్నారు. అందుకే భారతీయులకు అమెరికన్ హోటల్స్‌లో మర్యాదలు పెరిగాయన్నమాట.
ఇక 2024లో భారతీయ ప్రయాణికులు చేసిన యూఎస్ బుకింగ్‌లు 50 శాతం కంటే ఎక్కువ పెరిగాయని, 2019లో మహమ్మారికి ముందు ఉన్న స్థాయిల కంటే ఇది మూడు రెట్లు అధికమని ట్రిప్‌అడ్వైజర్ బ్రాండ్ ట్రావెల్ సంస్థ వయాటర్ తెలిపింది.