Shiva Rajkumar: క్యాన్సర్ చికిత్స చివరి దశకు చేరుకుంది: శివరాజ్ కుమార్
- అమెరికాలో క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంటున్న శివరాజ్ కుమార్
- త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ వీడియో విడుదల
- తన భర్త క్యాన్సర్ ను జయించారన్న శివరాజ్ కుమార్ భార్య గీత
ప్రముఖ కన్నడ సినీ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన అభిమానులకు ఆయన గుడ్ న్యూస్ తెలిపారు.
నూతన సంవత్సరం సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. చికిత్స చివరి దశకు చేరుకుందని... త్వరలోనే మీ ముందుకు వస్తానని శివరాజ్ కుమార్ తెలిపారు. క్యాన్సర్ సోకిందని తెలిసిన తర్వాత ఎవరైనా భయపడతారని... అయితే, ఆ భయం నుంచి బయటపడేందుకు తన భార్య గీత, తన అభిమానులు ఎంతో సహకరించారని చెప్పారు. తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
పూర్తి చేయాల్సిన సినిమాల కోసం తాను ఎంతో కష్టపడ్డానని... కీమో థెరపీ చేయించుకుంటూనే '45' సినిమా షూటింగ్ ను పూర్తి చేశానని తెలిపారు. వైద్యులు కూడా ఎంతో సహకరించారని చెప్పారు.
మరోవైపు శివరాజ్ కుమార్ భార్య గీత స్పందిస్తూ... తన భర్త క్యాన్సర్ ను జయించారని చెప్పారు. అభిమానులకు ఇది తీపి కబురని... త్వరలోనే కర్ణాటకకు తిరిగొస్తామని పేర్కొన్నారు.