KTR: ఫార్ములా-ఈ కేసులో పస లేదు... అదొక లొట్టపీసు కేసు: కేటీఆర్
- అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదన్న కేటీఆర్
- ఏదో ఒక రకంగా తనను జైలుకు పంపాలని చూస్తున్నారని మండిపాటు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపిస్తామని ధీమా
ఫార్ములా ఈ-కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూద్దామని అన్నారు.
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తప్పని కేటీఆర్ చెప్పారు. ఫార్ములా ఈ-కార్ కేసులో పస లేదని... అదొక లొట్టపీసు కేసు అని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానాలే లేవని ఎద్దేవా చేశారు. ఏదో ఒక రకంగా తనను జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఇది తనపై చేసిన ఆరో ప్రయత్నమని చెప్పారు.
ఫార్ములా రేసు కావాలనేది తన నిర్ణయమని... రేసు వద్దనేది రేవంత్ నిర్ణయమని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27న భారీ బహిరంగసభను నిర్వహిస్తామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగస్తులు, పాన్ కార్డ్ ఉన్నవారికి రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రీజనల్ రింగ్ రోడ్డులో రూ. 12 వేల కోట్ల కుంభకోణం జరగబోతోందని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నామని తెలిపారు. ఈ ఏడాది ఉపఎన్నికలు రావచ్చని జోస్యం చెప్పారు.