Rajamouli: అమెజాన్ అడవుల్లో ఇక పాన్ ఇండియా కథ పరుగులు!
- ఇక రంగంలోకి దిగుతున్న రాజమౌళి
- ఈ నెల చివరి నుంచి రెగ్యులర్ షూటింగు
- నిధివేట నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్
- హైలైట్ గా నిలవనున్న లొకేషన్స్
రాజమౌళి... తెలుగు సినిమాకి ఈ పేరు ఒక కీర్తి కిరీటం. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా ఒక సంచలనం. అపజయమెరుగని ఆయన... దర్శకుల మార్గదర్శిగా నిలిచారు. అలాంటి రాజమౌళి 'RRR' తరువాత చేయనున్న సినిమా కోసం అభిమానులంతా చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మహేశ్ బాబుతో కలిసి ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ కోసం కసరత్తు చేస్తున్నాడు.
రాజమౌళి కెరియర్ ను పరిశీలిస్తే ఆయన పక్కా ప్లానింగుతో ముందుకు వెళుతుండటం కనిపిస్తుంది. 'సింహాద్రి'... 'ఛత్రపతి' వంటి మాస్ యాక్షన్ సినిమాలు, 'యమదొంగ'... 'ఈగ' వంటి సినిమాలతో ఫాంటసీ జోనర్ ను టచ్ చేయడం కనిపిస్తుంది. ఇక 'మగధీర'... 'బాహుబలి' సినిమాలతో జానపదాలను గుర్తుచేస్తూ, ఈ కాలంలో గుర్రాలను... రథాలను తెరపై పరిగెత్తించారు. తెలుగు సినిమా జెండాను ప్రపంచపటంపై ఎగరేశారు.
'మగధీర'... 'బాహుబలి' సినిమాలలో రాజమౌళి అడవులను, జలపాతాలను తెరపై ఆవిష్కరించిన తీరు చూసిన వాళ్లంతా, ఫారెస్టు నేపథ్యంలో ఆయన ఒక యాక్షన్ అడ్వెంచర్ చేస్తే బాగుంటుందని భావించారు. ఇప్పుడు రాజమౌళి ఎంచుకున్న కథా నేపథ్యం అదే. ఆయన తయారు చేసుకున్న కథ ఇప్పుడు అమెజాన్ అడవుల్లో పరుగులు తీయనుంది. నిధి తాలూకు వేట నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. అడవులు, గుహలు, సొరంగ మార్గాలు, జలపాతాలతో కూడిన లొకేషన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. ఈ నెల చివరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది.