Davos Summit: దావోస్ సదస్సుకు హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్
- దావోస్ లో జనవరి 20 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
- ఈ నెల 19న దావోస్ బయల్దేరనున్న చంద్రబాబు బృందం
- 'షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్' థీమ్ తో దావోస్ లో ఏపీ బృందం ప్రదర్శన
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతి ఏడాది ప్రపంచ ఆర్థిక వాణిజ్య సదస్సు నిర్వహిస్తుండడం తెలిసిందే. 2025లో జనవరి 20 నుంచి 24 వరకు దావోస్ సదస్సు జరగనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు.
ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అంతర్జాతీయ సంస్థలకు వివరించేందుకు దావోస్ వేదికను ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం 'షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్' థీమ్ తో ఏపీ బృందం దావోస్ లో ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. దావోస్ పర్యటన కోసం చంద్రబాబు బృందం ఈ నెల 19న రాష్ట్రం నుంచి బయల్దేరనుంది. సీఎం వెంట పరిశ్రమలు, ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు అధికారులు కూడా దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.
ఈ సదస్సులో పాల్గొనే దిగ్గజ పారిశ్రామిక సంస్థలకు ఏపీలో అందుబాటులో ఉన్న వనరులు, పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ వివరించనున్నారు. ఏపీలో టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ తదితర అంశాలపై వివరించనున్నారు. రాష్ట్రంలో స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులకు పరిచయం చేయనున్నారు.