Drunken Thief: నార్సింగిలో... వైన్ షాపులో దొంగతనానికి వచ్చి తాగి నిద్రపోయాడు!
- ఆదివారం రాత్రి వైన్ షాపులో దూరిన దొంగ
- మద్యం బాటిళ్లు చూసి ఆగలేక ఫుల్లుగా తాగేసిన వైనం
- మరుసటి రోజు ఉదయం దుకాణదారు కంటపడిన దొంగ
హైదరాబాద్ శివారు ప్రాంతం నార్సింగిలో ఆసక్తికర ఘటన జరిగింది. వైన్ షాపులో చోరీకి వచ్చిన ఓ దొంగ మద్యం తాగి అక్కడే పడిపోయి, చివరికి కటకటాల్లోకి చేరాడు.
మెదక్ జిల్లా నార్సింగిలో కనకదుర్గ వైన్ షాపు యజమాని పర్షా గౌడ్ ఆదివారం రాత్రి దుకాణం మూసేసి ఇంటికి వెళ్లాడు. ఓ దొంగ షాపు పైకప్పుకు ఉన్న రేకులను తొలగించి లోపలికి చొరబడ్డాడు. అక్కడున్న డబ్బును తనతో తెచ్చుకున్న బ్యాగులో సర్దుకున్నాడు. అక్కడున్న మందు బాటిళ్లను కూడా బ్యాగులో పెట్టుకున్నాడు.
షాపులో ఉన్న మందుబాటిళ్లను చూసి ఆగలేకపోయిన ఆ దొంగ... ఫుల్లుగా తాగేసి అక్కడే పడిపోయాడు. మరుసటిరోజు ఉదయం షాపు ఓనరు వచ్చి దుకాణం తెరిచి చూడగా... ఓ వ్యక్తి నేలపై పడిపోయిన స్థితిలో కనిపించాడు. వెంటనే ఆయన నార్సింగి పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు వచ్చి ఆ దొంగను తట్టి లేపారు. ఎదురుగా పోలీసులు కనిపించే సరికి ఆ దొంగ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు... మొదట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ఆ దొంగను అరెస్ట్ చేశారు.