Harish Rao: తప్పుడు సమాచారం ఇస్తే శిక్షార్హుడినంటూ రైతు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలంట!: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం

Harish Rao fires at Revanth Reddy

  • రైతుబంధు కోసం సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలనడం దారుణమని ఆగ్రహం
  • రేవంత్ రెడ్డి రైతుబంధును విజయవంతంగా ఎగ్గొట్టారని విమర్శ
  • కేసీఆర్ 11సార్లు రైతుబంధు ఇచ్చారన్న హరీశ్ రావు

తామిచ్చే సమాచారం అంతా సరైనదేనని, తప్పుడు సమాచారం ఇచ్చినా... తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు శిక్షార్హుడినంటూ రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. రైతు భరోసా విషయంలో ఇలా సెల్ఫ్ డిక్లరేషన్ కోరడం దారుణమన్నారు. ఇలా చేయడం ద్వారా రైతులను నేరస్తులుగా భావించడమే అన్నారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి రైతుబంధును విజయవంతంగా ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి, సీఎం రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు కుస్తీ పడుతున్నారన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గతంలో రైతుబంధు ఏడాదికి మూడుసార్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారని హరీశ్ రావు గుర్తు చేశారు.

కానీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రైతుబంధు ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట... అధికారంలో ఉంటే మరో మాట అని విమర్శించారు. రుణమాఫీకి షరతులు పెట్టి సగం మంది రైతులకు మాఫీ చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులతో కేసీఆర్ 11 సార్లు రైతుబంధు ఇచ్చారని హరీశ్ రావు తెలిపారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు షరతులు పెడతారా? అన్నారు. రుణమాఫీ కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని హరీశ్ రావు వాపోయారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఇంట్లో కాలు బయటపెట్టకుండా నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు పడేదన్నారు. రైతుబంధు రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News