Sandhya Theatre: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై డీజీపీ, హైదరాబాద్ సీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
- తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశం
- సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరిపించాలని సూచన
- నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) నోటీసులు ఇచ్చింది. పుష్ప-2 విడుదల సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీసు బాసులను ఆదేశించింది. సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని తెలిపింది. సంధ్య థియేటర్ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.