smart meters: స్మార్ట్ మీటర్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ..! ఆ సంస్థకు బిగ్ షాక్
- జగన్ సర్కార్ హయాంలో 18.58 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశాలు
- స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులు రద్దు చేయాలని నిర్ణయించిన కూటమి సర్కార్
- షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కు బిగ్ షాక్
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకుని చేపట్టిన వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు పనులను కూటమి సర్కార్ రద్దు చేయనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు బిగ్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో రైతులు, ప్రజా సంఘాలు వ్యతిరేకించినా గత వైసీపీ ప్రభుత్వం 18.58 లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
కేంద్రం మెడ మీద కత్తి పెట్టినా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటునకు తాను ఒప్పుకోలేదని నాటి తెలంగాణ సీఎం కేసిఆర్ వ్యాఖ్యానించారు. ఏపీలోని జగన్ ప్రభుత్వం 2 శాతం అదనపు రుణం కోసం మీటర్ల ఏర్పాటుకు ఒప్పుకుందని బహిరంగంగానే కేసిఆర్ కామెంట్స్ చేశారు. మరో పక్క అస్మదీయ సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు లబ్దిచేకూర్చడం కోసమే జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టును చేపట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రం 50 వేల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రాజెక్టును ఇంతటితో నిలిపివేయాలని కూటమి సర్కార్ నిర్ణయానికి వచ్చింది.