Chamala Kiran Kumar Reddy: రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారు: ఎంపీ చామల
- దోచుకుని దాచుకునే అలవాటు కాంగ్రెస్ కు లేదన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి
- కార్ రేసు కేసుపై కేటీఆర్ రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నారని విమర్శ
- తప్పు చేయకపోతే నిర్దోషి అని నిరూపించుకోవాలని వ్యాఖ్య
ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్) రూ. 7 వేల కోట్ల ప్రాజెక్ట్ అని... కానీ, ఆ ప్రాజెక్ట్ లో రూ. 12 వేల కోట్ల అవినీతి జరగబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. దోచుకుని దాచుకునే అలవాటు కాంగ్రెస్ కు లేదని చెప్పారు. కేటీఆర్ ను భయం వెంటాడుతోందనే విషయం ఆయన మాటలు చూస్తే తెలిసిపోతుందని అన్నారు. పాన్ ఇండియా సినీ స్టార్ (అల్లు అర్జున్) అరెస్ట్ తో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు.
ఫార్ములా ఈ-కార్ కేసుపై కేటీఆర్ రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నారని చామల దుయ్యబట్టారు. రూ. 56 కోట్లు బదిలీ చేసింది నిజమంటారని... రూపాయి అవినీతి కూడా లేదని అంటారని.. రూపాయి బదిలీ కూడా జరగలేదని అంటారని... డబ్బులు బదిలీ చేయాలని అరవింద్ కుమార్ కి తానే చెప్పానని అంటారని... ఆ తర్వాత తనకేం సంబంధమని అంటారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తప్పు చేయకపోతే నిర్దోషి అని నిరూపించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు, కవిత దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.