Maharashtra: ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయాడన్నారు... స్పీడ్ బ్రేకర్ కుదుపులతో కదలికలు
- మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఘటన
- డిసెంబర్ 16న గుండెపోటుతో కుప్పకూలిన పాండురంగ
- ఆసుపత్రికి తీసుకెళ్లడంతో చనిపోయినట్లుగా ధ్రువీకరించిన డాక్టర్లు
- అంబులెన్స్‌లో ఇంటికి తీసుకు వెళుతుండగా వాహనం కుదుపులతో కదలికలు
- మరో ఆసుపత్రికి తీసుకు వెళ్లి సర్జరీ చేయించిన కుటుంబ సభ్యులు
ఓ వ్యక్తికి గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలించడంతో పరీక్షించిన వైద్యులు అతను చనిపోయాడని చెప్పారు. దీంతో అతడిని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళుతుండగా ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం కుదుపులకు గురైంది. ఈ కుదుపులతో చనిపోయిన (చనిపోయాడనుకున్న) వ్యక్తి శరీరంలో కదలికలు వచ్చాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
పాండురంగ అనే 65 ఏళ్ల వ్యక్తి గత ఏడాది డిసెంబర్ 16న గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతనిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అతనిని పరిశీలించిన డాక్టర్లు చనిపోయినట్లు చెప్పారు. డాక్టర్లు చనిపోయినట్లుగా ధ్రువీకరించడంతో గ్రామంలో అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పాండురంగ ఇంటికి చేరుకొని మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు, మృతదేహాన్ని అంబులెన్స్‌లో సొంత గ్రామానికి తీసుకు వెళుతున్నారు. మార్గమధ్యంలో ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం కుదుపులకు లోనైంది.
ఈ కుదుపులతో అతని శరీరంలో కదలికలు వచ్చాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అదే అంబులెన్స్‌లో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన గుండెకు యాంజియోప్లాస్టీ చేశారు. రెండు వారాల చికిత్స అనంతరం అతను కోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు.