Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు... విచారణకు హాజరుకాలేనన్న తులసిబాబు
- విచారణకు హాజరుకావడానికి కొంత సమయం కావాలన్న తులసిబాబు
- ఈ మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీకి లేఖ
- డాక్టర్ ప్రభావతికి ముందస్తు బెయిల్ నిరాకరించిన కోర్టు
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు పోలీసు విచారణకు డుమ్మా కొట్టాడు. ఈనాటి విచారణకు రాలేనని... తనకు కొంత సమయం కావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కు లేఖ రాశాడు. హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడనే ఆరోపణలను తులసిబాబు ఎదుర్కొంటున్నాడు.
మరోవైపు విచారణకు హాజరు కాకుండా తులసిబాబు సమయం కోరితే పరిగణనలోకి తీసుకోవద్దని ఇప్పటికే జిల్లా ఎస్పీకి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. 2021 మే 14 రాత్రి సీఐడీ అధికారులు తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన సమయంలో... 115 కిలోల బరువున్న పొడవైన వ్యక్తి తన ఛాతీపై కూర్చున్నాడని తనకు కొంతమంది చెప్పారని... ఆ వ్యక్తిని తులసిబాబుగా తాను భావిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. తులసిబాబును విచారణకు పిలిచిన రోజు తనకు అనమతి ఇస్తే గుర్తుపట్టగలనని తెలిపారు.
మరోవైపు, ఈ కేసులో 5వ నిందితురాలిగా ఉన్న డాక్టర్ ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ప్రభావతి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి నిందితులతో కుమ్మక్కు అయ్యారని ప్రాసిక్యూషన్ తరపున ప్రాసిక్యూషన్స్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ కోర్టుకు తెలిపారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ప్రభావతికి ముందస్తు బెయిల్ నిరాకరించింది.