Revanth Reddy: ఆర్ఆర్ఆర్ కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: రేవంత్ రెడ్డి
- నాగపూర్-విజయవాడ కారిడార్ కోసం భూసేకరణ ప్రక్రియ చేపట్టాలన్న సీఎం
- అటవీ శాఖ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న సీఎం
- అటవీ శాఖ, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచన
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ఆర్ఆర్ఆర్, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రీజినల్ రింగ్ రోడ్డుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నాగపూర్-విజయవాడ కారిడార్‌కు సంబంధించి రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతి లోగా పూర్తి చేయాలన్నారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. అటవీ శాఖ, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమన్వయం కోసం ఈ రెండు శాఖల నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించాలన్నారు. ఈ రెండు శాఖలు సమావేశమై సంబంధిత శాఖల పరిధిలోని భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.
తెలంగాణలోని ప్రతి మండల కేంద్రం నుంచి ఆ మండలంలోని గ్రామాలకు బీటీ రోడ్డు ఉండాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్డు వెడల్పు కార్యక్రమాలు డిజైన్ చేయాలన్నారు. ఈ రోడ్ల నిర్మాణాల కోసం విడతల వారీగా నిధులు విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్డు లేని గ్రామం ఉండవద్దన్నారు.