Jasprit Bumrah: ఆస్ట్రేలియాలో బుమ్రా రికార్డుల వేట.. 46 ఏళ్ల రికార్డు బద్దలు
- ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు
- 46 ఏళ్ల క్రితం నాటి బిషన్‌సింగ్ బేడీ రికార్డు బద్దలు
- ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 32 వికెట్లు పడగొట్టిన స్టార్ పేసర్
ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక చివరి టెస్టులో నిప్పులు చెరుగుతున్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బుమ్రా పదునైన బంతులతో ఆసీస్ బ్యాటర్లను కంగారెత్తిస్తున్నాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా మరో రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో ఒకే సిరీస్‌లో (కనీసం ఐదు టెస్టులు) అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
తాజా మ్యాచ్‌లో ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్ వికెట్లను పడగొట్టిన బుమ్రా ఇప్పటి వరకు 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 46 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఇప్పటి వరకు ఈ రికార్డు బిషన్‌సింగ్ బేడీ పేరిట ఉంది. 1977-78 సిరీస్‌లో ఆసీస్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో బేడీ 31 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడా రికార్డు బద్దలైంది. కాగా, గతేడాది 13 టెస్టుల్లో బుమ్రా 71 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసుకొన్న ఆటగాడిగా టాప్ ప్లేస్‌లో నిలిచాడు.