Supreme Court: తల్లిదండ్రులను పట్టించుకోని తనయుడికి ఝలక్.. ఆస్తి హక్కుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court Quashes Gift Deed Executed By Senior Citizen In Favour Of Son

  • తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి ఆస్తిని పొందలేరని వ్యాఖ్య
  • వృద్ధుల రక్షణ కోసం 2007లో ‘తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం’
  • ఓ కేసులో కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసిన సుప్రీం

తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు తీసుకునే హక్కుతో పాటు వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా బిడ్డలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బాధ్యతను విస్మరిస్తే హక్కును పొందజాలరని తేల్చిచెప్పింది. జన్మనిచ్చిన వారిని నిర్లక్ష్యం చేసే బిడ్డలు ఆస్తి పొందలేరని చెప్పింది. వృద్ధుల సంరక్షణ కోసం ‘తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం 2007’ ప్రకారం ట్రైబ్యునళ్లు ఏర్పాటయ్యాయని సుప్రీం గుర్తుచేసింది. బిడ్డల నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు సంబంధించిన కేసులను ఈ ట్రైబ్యునళ్లు సత్వర విచారణ జరుపుతాయని పేర్కొంది. ఆస్తిపై హక్కులను తిరిగి కన్నవారికి దక్కేలా ఆదేశించే అధికారం కూడా ఈ ట్రైబ్యునళ్లకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

వృద్ధాప్యంలో తమను ప్రేమగా చూసుకుంటానని చెప్పి ఆస్తిని దక్కించుకున్న కొడుకు.. తర్వాత మాట తప్పాడని, తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని మధ్యప్రదేశ్ కు చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ సి.టి.రవికుమార్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం.. ఆ తల్లిదండ్రులు కొడుకుకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసింది. సదరు ఆస్తిపై తిరిగి తల్లిదండ్రులకు హక్కు కల్పించింది.

ఇదీ కేసు..
మధ్యప్రదేశ్‌ లోని చిత్తార్‌ పూర్‌కు చెందిన ఓ వృద్ధురాలు తన కుమారుడిపై కోర్టుకెక్కారు. తమ ఆస్తిలో కొంత భాగం ఇప్పటికే గిఫ్ట్ డీడ్ కింద కొడుకుకు కట్టబెట్టామని చెప్పారు. జన్మనిచ్చిన తమను కొడుకు సరిగా చూసుకోవడంలేదని, కొడుకు ప్రేమాభిమానాలు నోచుకోవడంలేదని వాపోయింది. ఆస్తి కోసం కొడుకు తమను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కొడుకుకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసి ఆ ఆస్తిపై తమ హక్కును పునరుద్ధరించాలని కోరింది.

హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ కేసును విచారించి గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసింది. దీనిపై కొడుకు అప్పీల్ చేయడంతో ద్విసభ్య ధర్మాసనం విచారించి గిఫ్ట్ డీడ్ రద్దు కుదరదని తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే బిడ్డలకు వారి ఆస్తిని పొందే హక్కులేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిబ్రవరి నెలాఖరులోగా తల్లిదండ్రుల ఆస్తిని వారికి అప్పగించాలని కుమారుడికి ఆదేశాలు జారీచేసింది.

  • Loading...

More Telugu News