BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా... కేజ్రీవాల్‌పై మాజీ ఎంపీ పోటీ
- 70 అసెంబ్లీ స్థానాలకు 29 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
- కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నుంచి మాజీ ఎంపీ పర్వేశ్ వర్మను ప్రకటించిన బీజేపీ
- సీఎం అతిశీపై మాజీ ఎంపీ రమేశ్ పోటీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. అయినప్పటికీ బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ మాజీ ఎంపీని పోటీకి దింపింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ పర్వేశ్ వర్మను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. మరోవైపు, ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం షీలాదీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌ను బరిలోకి దింపుతోంది.
పర్వేశ్ వర్మ... ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ తనయుడు. 2014 నుంచి 2024 వరకు వెస్ట్ ఢిల్లీ నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. 2014లో 2.68 లక్షల ఓట్ల మెజార్టీ, 2019లో 5.78 లక్షల ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీతో పర్వేశ్ వర్మ బీజేపీ నుంచి గెలిచారు.
ఇక, కల్కాజీ స్థానం నుంచి ఢిల్లీ సీఎం అతిశీపై బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేశ్ బిధూడి పోటీ చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కైలాశ్ గెహ్లాట్ బిజ్వాసన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. గత ఏడాది బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అరవింద్ సింగ్లీ లవ్లీ గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు.