Nara Lokesh: ఆ ముగ్గురే నాకు స్ఫూర్తి: విద్యార్థుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ సమాధానాలు

Nara Lokesh answers to Students questions

  • జూనియర్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
  • విజయవాడ పాయకాపురం కాలేజీలో విద్యార్థులతో లోకేశ్ ముఖాముఖి
  • విద్యార్థుల ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు ఇచ్చిన విద్యాశాఖ మంత్రి

విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. 

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి జక్రిరెడ్డి మాట్లాడుతూ... ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా విద్యార్థుల బ్రెయిన్ డ్రెయిన్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. 

మంత్రి లోకేశ్ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. "62 సంవత్సరాలు కలసికట్టుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్నాం. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తెచ్చేందుకు చంద్రబాబు ఎంతో కృషిచేశారు. 2014లో కట్టుబట్టలతో బయటకు వచ్చాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణతో ముందుకు వెళ్లాం. ఒక్క కియా వల్ల అనంతపురం జిల్లా తలసరి ఆదాయంలో 3వ స్థానానికి చేరింది. చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తెచ్చాం, ప్రకాశంలో బయో ఫ్యూయల్ రంగంలో పెట్టుబడులకు రిలయన్స్ ముందుకు వచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఉభయ గోదావరి ఆక్వా, డిఫెన్స్, పెట్రో కెమికల్స్, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా, ఐటీ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాం" అని చెప్పారు. 

-షణ్ముక్, ఇంటర్ బైపిసి
కళాశాలలో కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. కాలేజి సంరక్షణ ఇబ్బందిగా ఉంది. మీరు మా బంగారు భవిష్యత్తును నిర్మిస్తారని నమ్ముతున్నాం. కళాశాల పక్కనే బాలికల వసతి గృహం ఉంది. వరదల సమయంలో క్రిమికీటకాల వల్ల అక్కడి విద్యార్థినులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మరోవైపు బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. ఆ బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉంది. అక్కడి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మేము మీ స్థాయికి చేరుకునేలా సహకారం అందించండి.

లోకేశ్: మీరు నాకన్నా పెద్దస్థాయికి చేరాలన్నదే నా ఆకాంక్ష. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో భారత్ లో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, షణ్ముక్ కోరిన విధంగా తప్సనిసరిగా కాంపౌండ్ వాల్, హాస్టళ్ల మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ధికి రూ.5 వేల కోట్లు అవసరం. ఆ నిధులు ఎలా సమీకరించాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నాటికి అడిషనల్ క్లాస్ రూమ్స్, పెయింటింగ్స్, ప్లే గ్రౌండ్, ల్యాబ్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

మయూరి, సెకండ్ ఇయర్, ఎంపీసీ
సమాజంలో ప్రభుత్వ కాలేజి విద్యార్థులను చిన్నచూపు చూస్తారు, ప్రైవేటు కాలేజిల విద్యార్థులతో సమానంగా మమ్మల్ని చూడటానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు?

లోకేశ్: ప్రైవేటురంగంలో జూనియర్ కాలేజీల్లో పిల్లలను కేటగిరైజ్ చేసి సబ్జెక్టువారీగా ఎక్సపర్ట్ లతో శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ కాలేజిల్లో కూడా క్వశ్చన్ బ్యాంకు, మోడల్ పేపర్ల విధానాన్ని తెస్తున్నాం. విద్యార్థుల పనితీరును తెలుసుకునేలా తల్లిదండ్రుల వాట్సాప్ కు లింకు చేస్తాం. వివిధ సబ్జెక్టులో పెర్ఫార్మెన్స్ సప్లిమెంటేషన్ కోసం ఐఐటీ మద్రాసుతో ఒప్పందం చేసుకున్నాం. పనిగంటలను గంటన్నర పెంచాం. కామన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరానికి ఇవన్నీ పూర్తిచేస్తాం. 

ఎం.రాజేష్, సీనియర్ ఎంపీసీ
యువగళంలో 3 వేలకు పైగా కి.మీ.ల పాదయాత్ర చేశారు, మీ ఫిట్ నెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ ఇన్ స్పిరేషన్ ఎవరు?

లోకేశ్: ఫిట్ నెస్ కన్నా సంకల్పం అవసరం. మార్పుకోసమే విద్యాశాఖను తీసుకున్నాను. రోడ్ లెస్ ట్రావెల్ చేసి కష్టతరమైన రహదారిని సులభతరం చేసుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఆ శక్తి మనకు వస్తుంది. నాకు ముగ్గురు వ్యక్తులు ఇన్ స్పిరేషన్... లిక్వానియో, సింగపూర్ ప్రధానిగా పనిచేశారు. మత్స్యకారులు ఉన్న చిన్న ప్రాంతాన్ని ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేశారు. మాజీ ప్రధాని వాజ్ పేయి గారు అందరి సమస్యల గురించి తెలుసుకుంటారు, మంచి ఐడియాలను ఇంప్లిమెంట్ చేస్తారు. చంద్రబాబుగారు క్రమశిక్షణకు మారుపేరు. 75 సంవత్సరాల వయసులో అందరికంటే స్పీడ్ గా పని చేస్తారు. వారి ముగ్గురినుంచే నేను స్పూర్తి పొందాను. మీరు కూడా ఉన్నతమైన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లండి.

షేక్ రేష్మా, సీనియర్ ఇంటర్ బైపీసీ
మా కళాశాలలో 8 సెక్షన్లు ఉన్నాయి, 4 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి, మరో 4 క్లాస్ రూమ్ లు మంజూరు చేయండి.
 
లోకేశ్: క్లాస్ రూమ్స్, పెయింటింగ్, ప్రహరీ గోడ, ల్యాబ్స్ ఏర్పాటుకు కృషిచేస్తా. పాస్ పర్సంటేజి పెరిగితే మరిన్ని సౌకర్యాలు కల్పిస్తా. కష్టపడి చదివి మంచి పేరు తీసుకురండి.

కె.నీలిమ, ఎంపీసీ, సెకండియర్
కళాశాలకు పెయింటింగ్ వేయించండి. ల్యాబ్ లు ఏర్పాటుచేయండి.

లోకేశ్: కళాశాలకు పెయింటింగ్ చేయిస్తా. పెయింట్స్ తోపాటు మిగతా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తాం. పరీక్షలు పూర్తయ్యాక అడిషనల్ క్లాస్ రూమ్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం.

రమ్య సీనియర్ ఇంటర్, బైపీసీ
రాత్రిపూట ఇబ్బంది కలగకుండా కాలేజీ వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. 

లోకేశ్: రేపటికల్లా కెమెరాలు పెట్టిస్తాం, పోలీసుశాఖకు అనుసంధానిస్తాం.

వైష్ణవి, సీనియర్ ఇంటర్ సీఈసీ
చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా నైతిక విలువల పెంపుదలకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?

లోకేశ్: నేను ఇటీవల ఆయనను కలిశాను. పిల్లలకు ప్రత్యేకంగా ఒక బుక్ తయారుచేసి ఇవ్వాలని నిర్ణయించాం. ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో క్లస్టర్ యూనిట్ గా నేరుగా పిల్లలతో సమావేశమై చైతన్య పర్చేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తంచేశారు. సమాజంలో మార్పురావాలంటే ముందుగా మహిళలు మాట్లాడాలి. మహిళలను అవమానకరంగా మాట్లాడే కొన్ని పద్ధతుల్లో మార్పు రావాలి. మార్పు మా నుంచి, ఫిల్మ్ స్టార్స్ నుంచి, సమాజం నుంచి రావాలి. 

పి.కేశవసాయి, సెకండియర్ ఎంపీసీ
యువతను డ్రగ్స్ నుంచి బయటకు తీసుకురావడానికి మార్గాలు చెప్పండి.

మంత్రి సత్యకుమార్: విద్యార్థులంతా దుర్వ్యసనానికి దూరంగా ఉండండి, ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే టోల్ ఫ్రీ నెంబర్ కు చెప్పండి. డీ ఎడిక్షన్ సెంటర్లు పెడుతున్నాం. యువతను డ్రగ్స్ బారిన పడకుండా టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేశాం. మీరంతా దూరంగా ఉండటంతోపాటు మిత్రులు కూడా వాటి బారిన పడకుండా కాపాడుకోవాలి. 

  • Loading...

More Telugu News