Australia vs India: జస్ప్రీత్ బుమ్రా గాయం గురించి ప్రసిద్ధ్ కృష్ణ ఏమన్నాడంటే...!
- సిడ్నీ వేదికగా ఆసీస్, భారత్ ఐదో టెస్టు
- గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో మైదానం వీడిన బుమ్రా
- బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపిన ప్రసిద్ధ్ కృష్ణ
- స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని వెల్లడి
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టు రెండో రోజు మధ్యలోనే భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ బుమ్రా మైదానం వీడిన విషయం తెలిసిందే. 31వ ఓవర్ ముగిసిన తర్వాత గాయం కారణంగా అకస్మాత్తుగా మైదానం వీడాడు. రెండో రోజు మొదటి సెషన్‌లో కీలకమైన మార్నస్ లబుషేన్‌ను పెవిలియన్‌కు పంపించిన బుమ్రా... రెండో సెషన్ మధ్యలోనే గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు.
అనంతరం వైద్య బృందంతో కలిసి స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. దీంతో భారత అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తీవ్ర గాయం కావడం వల్లే మైదానం వీడాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అసలు బుమ్రాకు అయిన గాయం ఏంటి? అనే దానిపై మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తాజాగా అప్‌డేట్ ఇచ్చాడు. "బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు. స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లాడని, వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోందని చెప్పాడు. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరింత స్పష్టత వస్తుంది" అని చెప్పుకొచ్చాడు.
"జస్ప్రీత్ బుమ్రాను సిడ్నీలోని సెంటెనియల్ పార్క్ ప్రాంతంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం స్కానింగ్ చేస్తున్నారు. సాయంత్రంలోగా రిపోర్ట్స్ వస్తాయి. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడానికి బుమ్రా సిద్ధంగా ఉన్నాడు. అయితే, బౌలింగ్ చేయాలా వద్దా అనేది ఆదివారం అతని పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది" అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.