KTR: అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం!: కేటీఆర్
- కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు వస్తాయన్న కేటీఆర్
- పరిపాలన చేతకాక తెలంగాణ దివాళా తీసిందంటున్నారని ఆగ్రహం
- దెబ్బతిన్నది మేడిగడ్డ బ్యారేజీ కాదు... రేవంత్ రెడ్డి బుర్ర అని మండిపాటు
అతి విశ్వాసం, చిన్న చిన్న తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా... కాంగ్రెస్ నేతలు ఇంకా కేసీఆర్ పేరే తలుస్తున్నారని విమర్శించారు. పరిపాలన చేయడం చేతకాక... రాష్ట్రం దివాళా తీసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతకావడం లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నదని అంటున్నారని... కానీ అసలు దెబ్బతిన్నది రేవంత్ రెడ్డి బుర్ర అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలు అయిందన్నారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వంద శాతం అమలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీ సాక్షిగా చెప్పానని గుర్తు చేశారు. కానీ రుణమాఫీ కాలేదన్నారు. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కోసం వేచి చూస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో కల్యాణలక్ష్మి, రైతుబంధు ఇలా ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రైతు భరోసా విషయంలో రైతులనే బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం, ఐటీ ఉంటే రైతు బంధు కట్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కటింగ్ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు.
కోటి ఎకరాలకు నీరు ఇవ్వాల్సి వస్తుందనే కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేయడం లేదని ఆరోపించారు. తప్పు చేస్తే కొట్లాడాల్సిందేనని... ప్రేక్షక పాత్ర వహించొద్దని పార్టీ కేడర్‌కు సూచించారు.