Game Changer: ఒక కలెక్టర్ కు, మంత్రికి జరిగిన పోరాటమే గేమ్ చేంజర్: శంకర్

Shankar reveals Game Changer plot point

 


రాజమండ్రిలో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర దర్శకుడు శంకర్ మాట్లాడారు. అనేక డబ్బింగ్ చిత్రాల ద్వారా తాను తెలుగులో అభిమానులను సంపాదించుకున్నప్పటికీ, తెలుగులో ఇప్పటిదాకా ఒక్క స్ట్రెయిట్ చిత్రం కూడా చేయలేకపోయానని వెల్లడించారు. ఇప్పుడు గేమ్ చేంజర్ తో ఆ లోటు తీరిపోయిందని అన్నారు. 

తెలుగు ప్రజలు తనపై అపారమైన ప్రేమను చూపించారని, వారికి ప్రేమను తిరిగివ్వాలన్న ఉద్దేశంతోనే గేమ్ చేంజర్ రూపంలో ఓ తెలుగు చిత్రాన్ని చేశానని శంకర్ వివరించారు. ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్న విషయానికి దిల్ రాజు, రామ్ చరణ్ సహకారం అందించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. 

"ఇది పూర్తిగా తెలుగు చిత్రం. అన్నీ తెలుగు సంప్రదాయాలే ఉండాలని, తెలుగు సంస్కృతే కనిపించాలని దాదాపుగా అందరినీ తెలుగు యాక్టర్లనే తీసుకున్నాం. ఎక్కువగా తెలుగు లొకేషన్లలోనే షూట్ చేశాం. ఈ చిత్ర కథ విషయానికొస్తే... ఒక కలెక్టర్ కు, మంత్రికి జరిగే యుద్ధమే గేమ్ చేంజర్. హీరో వెనుక ఒక స్టోరీ ఉంటుంది... అది చిత్ర కథలోని మెయిన్ పాయింట్ తో మింగిల్ అవుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటించలేదు... జీవించాడంటేనే బాగుంటుంది. ఎంతో హుందాగా, ఎంతో హృద్యంగా నటించాడు. అందుకు రామ్ చరణ్ కు అభినందనలు తెలుపుతున్నాను. 

ఈ చిత్రంలో నటించిన కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్రకు... సినిమా సాలిడ్ గా వచ్చేందుకు కృషి చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇతర టెక్నీషియన్లందరికీ కృతజ్ఞతలు" అంటూ శంకర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News