Koppula Eshwar: బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న వివరాలు ఉన్నాయి... మళ్లీ దరఖాస్తులు ఎందుకు?: కొప్పుల ఈశ్వర్
- ఏడాది దాటినా రైతు భరోసా అమలు చేయలేదని విమర్శ
- ప్రజాపాలనలో రైతు భరోసా దరఖాస్తులు కూడా ఉన్నాయన్న మాజీ మంత్రి
- ఏడు ఎకరాలకే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నమని విమర్శ
రైతుబంధు గురించి బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న వివరాలు ఉండగా రైతు భరోసా కోసం కొత్తగా మళ్లీ దరఖాస్తులు ఎందుకని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... ఏడాది దాటినా అమలు చేయలేదన్నారు. డిసెంబర్‌లో ఇస్తాం... సంక్రాంతి తర్వాత ఇస్తామంటూ వాయిదా వేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్వీకరించిన ప్రజాపాలనలోనూ రైతు భరోసా దరఖాస్తులు ఉన్నాయని గుర్తు చేశారు. రైతు భరోసాను కాలయాపన చేసేందుకే ఇప్పుడు మరోసారి దరఖాస్తుల స్వీకరణ అంటున్నారని ఆరోపించారు. షరతుల పేరిట రైతులు తమ చేతిని తమ నెత్తిపైనే పెట్టుకునేలా ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. రైతు భరోసాకు ఇన్ని ఆంక్షలు ఎందుకో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అభయహస్తం కోసం దరఖాస్తులను స్వీకరించిందని... కానీ వాటిని కూడా అమలు చేయలేదన్నారు. రైతును యూనిట్‌గా తీసుకొని గత కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతుబంధు ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు ఎకరాలకే ఇచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు.