Pani Puri: ఏడాదిలో రూ. 40లక్షలు ఆర్జించిన పానీపూరీ వ్యక్తి.. జీఎస్టీ నోటీసులతో నెట్టింట చర్చ!
- తమిళనాడులోని ఓ పానీపూరీ వ్యాపారికి జీఎస్టీ నోటీసులు
- 2023-24లో రూ. 40లక్షల ఆన్లైన్ పేమెంట్స్ వచ్చినట్టు గుర్తించిన కమిషన్ పన్ను చెల్లించాలని ఆదేశం
- కస్టమర్లు యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపు చేయడంతో బయటపడ్డ వ్యవహరం
- తమదైన శైలిలో స్పందిస్తున్న నెటిజన్లు
మన దగ్గర స్ట్రీట్ ఫుడ్ పానీపూరీకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మూలన చిన్న కొట్టుపెట్టిన కూడా జనాలు క్యూ కడుతుంటారు. గిరాకీకి తగ్గట్టుగానే పానీపూరీ వ్యాపారులు డబ్బులు ఆర్జిస్తుంటారు. అయితే, తమిళనాడులోని ఓ పానీపూరీ వ్యాపారికి జీఎస్టీ నోటీసులు రావడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సదరు వ్యాపారికి 2023-24లో రూ. 40లక్షల ఆన్లైన్ పేమెంట్స్ వచ్చినట్టు గుర్తించిన కమిషన్ పన్ను చెల్లించాలని ఆదేశించినట్టు సమాచారం. 2024 డిసెంబర్ 17న తమిళనాడు వస్తువులు, సేవల పన్ను చట్టం మరియు కేంద్ర జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 70 కింద అతనికి సమన్లు జారీ చేశారు. పానీపూరీ విక్రేత వ్యక్తిగతంగా హాజరు కావాలని, అవసరమైన పత్రాలను సమీక్ష కోసం సమర్పించాలని నోటీసులో పేర్కొనడం జరిగింది. దీనికోసం అతని 2022, 2023 లావాదేవీలను అధికారులు విశ్లేషించినట్టు తెలుస్తోంది. కస్టమర్లు యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపు చేయడంతో ఇది బయటపడింది.
ఈ వ్యవహరంపై ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. "ఇది చాలా మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల జీతం కంటే ఎక్కువ" అని ఒకరు, "ఒక్క డిజిటల్ చెల్లింపుల ద్వారానే ఇంత ఆర్జించాడంటే.. నగదు రూపంలో వచ్చిన డబ్బు మాట ఏంటి?. అతని వార్షిక ఆదాయం చాలా ఎక్కువ" అని మరొకరు, "ఈ వార్త నెట్టింట శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. భవిష్యత్తులో ఎవరూ యూపీఐ చెల్లింపులను అంగీకరించరు" అని ఇంకొకరు కామెంట్ చేశారు.