Australia vs India: బుమ్రా బౌలింగ్ లేకపోవడంతో భారత్‌కు దెబ్బ.. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
- భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం
- 162 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఆసీస్
- ఈ విజయంతో బీజీటీ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న కంగారూలు
- జస్ప్రీత్ బుమ్రాకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో బీజీటీ సిరీస్‌ను కంగారూలు కైవసం చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో 141/6 మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 16 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో 4 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఆసీస్‌కు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇక 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయకపోవడం టీమిండియాను దెబ్బ కొట్టింది. అతడు బౌలింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 41, వెబ్‌స్టర్ 39 (నాటౌట్), ట్రావిస్ హెడ్ 34 (నాటౌట్), సామ్ కొన్‌స్టాస్ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
ఇక ఈ టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ (10 వికెట్లు తీశాడు)కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. సిరీస్ ఆసాంతం రాణించిన జస్ప్రీత్ బుమ్రా 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్నాడు. ఐదు టెస్టుల్లో కలిపి అతడు 32 వికెట్లు పడగొట్టడంతో పాటు 42 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 181; రెండో ఇన్నింగ్స్: 162/4
భారత్ మొదటి ఇన్నింగ్స్: 185; రెండో ఇన్నింగ్స్: 157