Allu Arjun: అల్లు అర్జున్ కు మళ్లీ నోటీసులు.. ఎందుకంటే?

Allu Arjun Got Police Notice Again

  • కిమ్స్ ఆసుపత్రికి రావొద్దంటూ నోటీసులు అందజేసిన రాంగోపాల్ పేట పోలీసులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్
  • చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి వెళ్లిన పుష్ప

సినీ హీరో అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఆదివారం ఉదయం జూబ్లిహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి రాంగోపాల్ పేట పోలీసులు చేరుకున్నారు. హీరోను కలిసి నోటీసులు అందజేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోగా, ఆమె కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆ బాలుడిని త్వరలోనే పరామర్శిస్తానంటూ అల్లు అర్జున్ ఇటీవల పేర్కొన్నారు. శనివారం నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వెళ్లే అవకాశం ఉందని పోలీసులు భావించారు.

ఈ నేపథ్యంలోనే శ్రీతేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ కు రావొద్దని సూచిస్తూ రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు అందజేశారు. కాగా, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు విధించిన షరతులలో భాగంగా అల్లు అర్జున్ ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సి ఉంటుంది. ఈ రోజు ఆదివారం కావడంతో అల్లు అర్జున్ ఉదయం 10:30 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ లో హాజరు వేయించుకుని రిజిస్టర్ లో సంతకం చేసి వెనుదిరిగారు. పుష్ప రాక నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News