Kerala: ఇద్దరు పసికందులను చంపి పరార్.. పందొమ్మిదేళ్ల తర్వాత పట్టుబడ్డ హంతకులు

2 men killed woman and newborn twins arrested after 19 years

  • మారుపేర్లతో ఆధార్, ఓటర్ ఐడీలు పొందిన హంతకులు
  • పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సంఘంలో పెద్దమనుషులుగా చలామణి
  • విశ్వసనీయ సమాచారంతో మాజీ సైనికులు ఇద్దరినీ అరెస్టు చేసిన సీబీఐ అధికారులు

పందొమ్మిదేళ్ల క్రితం పదిహేడు రోజుల కవల పిల్లలను చంపేశారా యువకులు.. పసికందులతో పాటు తల్లిని కూడా మట్టుబెట్టారు. ఆపై ఊరు వదిలేసి, పేరు మార్చుకుని ఆధార్, ఓటర్ ఐడీలు కూడా పొందారు. ఇద్దరూ టీచర్లను పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే, నేరస్థులు ఎంతోకాలం చట్టం కళ్లు కప్పలేరనే నానుడిని నిజం చేస్తూ పందొమ్మిదేళ్ల తర్వాత పట్టుబడ్డారు. హంతకులలో ఒకరు మాజీ సైనికుడు కావడం గమనార్హం.

2006 ఫిబ్రవరిలో కేరళలోని కొల్లాం జిల్లాలో ఇద్దరు పసికందులు, తల్లి రంజినిని దుండగులు హత్య చేశారు. పదిహేడు రోజుల పసికందులను దారుణంగా హత్య చేయడం కేరళవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్థానిక యువకుడు దివిల్ కుమార్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. రంజిని, దివిల్ ల మధ్య సన్నిహిత సంబంధం ఉందని, రంజినికి పుట్టిన కవల పిల్లలకు తండ్రి దివిల్ కుమారేనని స్థానికులు చెప్పారు. పుట్టిన పిల్లలకు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే రంజినీతో తనకున్న అక్రమ సంబంధం విషయం బయటపడుతుందనే ఆందోళనతో తల్లీపిల్లలను మట్టుబెట్టేందుకు దివిల్ పథకం రచించాడు.

స్నేహితుడు, సైన్యంలో పనిచేస్తున్న రాజేష్ సాయంతో ముగ్గురినీ హతమార్చాడు. ఆపై స్నేహితులిద్దరూ పరారయ్యారు. స్థానికుల ద్వారా సేకరించిన సమాచారంతో ఈ హత్యలకు పాల్పడింది దివిల్ అని నిర్ధారించుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, పరారీలో ఉన్న దివిల్ ఆచూకీ దొరకకపోవడంతో కేసు మూలకు పడింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది. అయినప్పటికీ దివిల్, రాజేశ్ ల ఆచూకీ దొరకలేదు. హత్య చేసిన తర్వాత పలుచోట్లకు తిరుగుతూ పోలీసుల కళ్లుగప్పిన నిందితులు ఇద్దరూ చివరకు పుదుచ్చేరిలో సెటిలయ్యారు.

దివిల్ తన పేరును విష్ణుగా, రాజేశ్ తన పేరును ప్రవీణ్ కుమార్ గా మార్చేసుకుని తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు పొందారు. ఆపై స్థానికంగా టీచర్లుగా పనిచేస్తున్న మహిళలను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ పిల్లలు కూడా కలిగారు. ఈ విషయం ఇటీవల ఓ ఇన్ ఫార్మర్ ద్వారా తెలుసుకున్న సీబీఐ అధికారులు శుక్రవారం పుదుచ్చేరి వెళ్లి నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్ తో ఇద్దరినీ కొల్లాం తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. దీంతో పందొమ్మిదేళ్ల తర్వాత హంతకులు ఇద్దరూ ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు.

  • Loading...

More Telugu News