Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నాడా?... రిపోర్టర్ల ప్రశ్నకు కోచ్ గంభీర్ సమాధానం ఇదే!
- మీడియా మరింత సహేతుకంగా ఉండాలంటూ అసహనం వ్యక్తం చేసిన హెడ్ కోచ్
- రోహిత్ రిటైర్మెంట్ కథనాలను కొట్టిపారేసిన గౌతమ్ గంభీర్
- జట్టు ప్రయోజనం కోసం సిడ్నీ టెస్ట్‌లో ఆడకూడదని రోహిత్ నిర్ణయించుకున్నాడని వెల్లడి
- గొప్ప పరిపక్వత ప్రదర్శించాడంటూ గంభీర్ ప్రశంసలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవడంతో టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ నుంచి హిట్‌మ్యాన్ రిటైర్ కానున్నాడంటూ జోరుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రోహిత్ భవిష్యత్ ఏంటంటూ భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ప్రశ్నించగా ఆసక్తికరంగా స్పందించాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ఈ ప్రశ్నకు గంభీర్ కాస్త అసహనంతో సమాధానం ఇచ్చాడు.
‘‘రోహిత్ శర్మ విషయంలో నేను మొదట చెప్పదలచుకున్న విషయం ఏంటంటే మీరు (మీడియా ప్రతినిధులు) మరింత సహేతుకంగా వ్యవహరించాలి’’ అని గంభీర్ మండిపడ్డాడు. సిడ్నీ టెస్ట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని రోహిత్ గొప్ప పరిపక్వత కనబరిచాడని, కానీ కెప్టెన్ గురించి కొన్ని అర్ధంపర్థంలేని వార్తలు రాశారని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చాలా కథనాలు రాశారని, చాలా విషయాలు చెప్పారని అన్నాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్ తీసుకున్న నిర్ణయంపై చాలా చెడు ప్రచారం చేశారని విమర్శించాడు. వ్యక్తులకు సంబంధించిన వ్యవహారమనే విషయాన్ని మీడియా మరచిపోకూడదని, అంతకుమించి జట్టు, దేశం ముఖ్యమని గంభీర్ చెప్పాడు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టుకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని గంభీర్ వ్యాఖ్యానించాడు.
పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అందుబాటులో ఉంటే బాగుండేదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అయితే, జట్టు ఒక్కరిపై ఆధారపడకూడదని పేర్కొన్నాడు. ఈ మేరకు సిడ్నీ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడారు.