Bandi Sanjay: ఆ విషయంలో కాంగ్రెస్ కు గురువు కేసీఆరే: బండి సంజయ్

bandi sanjay criticizes congress government promises and debt policies

  • నెలకు పదివేల కోట్ల చొప్పున రేవంత్ సర్కార్ అప్పు చేస్తోందన్న బండి సంజయ్
  • కేసిఆర్‌కు, మీకు తేడా ఏముందని కాంగ్రెస్‌ను ప్రశ్నించిన సంజయ్
  • స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసా బంద్ పెట్టడం ఖాయమన్న బండి సంజయ్

ఎన్నికల సమయంలో కేసీఆర్ సర్కార్‌ను ఇష్టానుసారం అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదీ అదే కదా? అని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే 70 వేల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. ప్రతి నెల పది వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో రేవంత్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

ఇప్పటికే 70 వేల కోట్ల అప్పు తెచ్చిన రేవంత్ సర్కార్ .. గత మూడు నెలలుగా ప్రతి నెలా పది వేల కోట్ల అప్పు తెచ్చిందన్నారు. బడ్జెట్‌లో ఈ ఏడాది రూ.57 వేల కోట్లు మాత్రమే అప్పు తెస్తామని చెప్పి ఇప్పటికే ఆ పరిమితి దాటేశారన్నారు. మరో 30 వేల కోట్లు అప్పు కావాలని ఆర్‌బీఐకి ప్రతిపాదన పంపారన్నారు. ప్రతి నెలా పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో 6 లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దమైందని విమర్శించారు. ఈ లెక్కన కే‌సీఆర్ సర్కార్‌కు, రేవంత్ సర్కార్‌కు తేడా ఏముందని ప్రశ్నించారు. 

స్థానిక సంస్థల ఎన్నికల కోసం భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారని, ఎన్నికలయ్యాక రైతు భరోసా బంద్ పెట్టడం ఖాయమని అన్నారు. 70 లక్షల మంది రైతులకు ఇప్పటికే ఉన్న రూ.12,600 కోట్ల రైతు భరోసా బకాయిలను కూడా జనవరి 26న చెల్లిస్తారా? అని బండి ప్రశ్నించారు. అలాగే మహిళలు, నిరుద్యోగులు, అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా అదే రోజు నెరవేరుస్తారా? అనే విషయాలను కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వాలన్నారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్రతి నెలా ఏదో ఒక అంశం తెరపైకి తెస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఇంకా ఎన్నాళ్లు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్‌కు గురువు కేసిఆరేనని బండి సంజయ్ విమర్శించారు. 

రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలలో అభివృద్ధికి సహకరిస్తోందని పేర్కొన్నారు. పదేళ్లలో తెలంగాణలో రహదారుల అభివృద్దికి కేంద్రం లక్ష కోట్లు ఖర్చు పెట్టిందని అందుకే గుంతలు లేని రహదారులు ఉన్నాయన్నారు.   

  • Loading...

More Telugu News