KTR: ముందు జాగ్రత్తతోనే లాయర్లతో వచ్చాను: ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్

KTR at ACB office

  • ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్
  • కేటీఆర్ లాయర్లను అనుమతించని పోలీసులు
  • తనకు పోలీసులపై నమ్మకం లేదన్న కేటీఆర్

ఫార్ములా ఈ-కార్ కేసు విచారణకు గాను కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. తన లాయర్లతో కలిసి వచ్చిన ఆయన వాహనాన్ని ఏసీబీ కార్యాలయానికి కొంత దూరంలో పోలీసులు ఆపేశారు. కేటీఆర్ ను మాత్రమే ఏసీబీ కార్యాలయంలోకి అనుమతిస్తామని... లాయర్లను లోపలకు అనుమతించమని పోలీసులు వారికి చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడున్న మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. 

తనతో తన లాయర్ ఉంటే తప్పేముందని కేటీఆర్ ప్రశ్నించారు. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ ను ఇచ్చినట్టుగా పోలీసులు చేశారని ఆరోపించారు. తన విషయంలో కూడా ఇదే జరగవచ్చని... అందుకే తన లాయర్లను వెంటపెట్టుకుని వచ్చానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిది క్రిమినల్ మైండ్ అని... తాను చెప్పనిది చెప్పినట్టు చేసి... మీడియాకు లీకులిచ్చి... బద్నాం చేస్తారని చెప్పారు. తనకు పోలీసులపై నమ్మకం లేదని అన్నారు.

తనను రెండు గంటల పాటు ఏసీబీ కార్యాలయంలో కూర్చోబెడతారని... ఇదే సమయంలో తన ఇంట్లో సోదాలు చేస్తారని కేటీఆర్ చెప్పారు. ఇంట్లో డ్రగ్స్ పెట్టి... తన ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని కూడా చెపుతారని అన్నారు. తన మామ రెండో సంవత్సరీకం ఈరోజు జరుగుతోందని... పూజలు కూడా చేసుకోనీయకుండా తన ఇంట్లోకి పోలీసులు వెళ్తే తాను చేసేదేమీ లేదని చెప్పారు. తన క్వాష్ పిటిషన్ పై ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వ్ చేశారని... ఈ తరుణంతో తనతో పాటు తన లాయర్లను తీసుకెళ్తే పోలీసులకు వచ్చిన బాధ ఏమిటని ప్రశ్నించారు. తన లీగల్ టీమ్ తో కలిసే తాను ఏసీబీ కార్యాలయంలోకి వెళ్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News