Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్షను భగ్నం చేసిన పోలీసులు
- బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు
- పరీక్షలు మళ్లీ నిర్వహించాలంటూ ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్ష
- తెల్లవారుజామున దీక్షను భగ్నం చేసిన పోలీసులు
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటూ బీపీఎస్సీ అభ్యర్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి మద్దతుగా పాట్నాలోని గాంధీ మైదాన్ లో గత నాలుగు రోజులుగా ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహారదీక్షను చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చట్ట విరుద్ధంగా నిరసన చేపట్టినందువల్ల ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిరసన ప్రదేశంలో గుమికూడిన అభ్యర్థులను అక్కడి నుంచి పంపించేశామని చెప్పారు.