Krithi Shetty: బుట్టబొమ్మలాంటి అమ్మాయిని బొత్తిగా పట్టించుకోవడమే లేదే!
- 'ఉప్పెన' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి
- యూత్ లో పెరిగిపోయిన ఫాలోయింగ్
- వరుసగా వచ్చి పడిన ఫ్లాపులు
- తెలుగులో తగ్గిన అవకాశాలు
- ఆమెను మరిచిపోలేకపోతున్న అభిమానులు
కృతి శెట్టి .. 'ఉప్పెన' సినిమాతో ఊరించిన బ్యూటీ. తొలి సినిమాతోనే 100 కోట్ల హీరోయిన్ అనిపించుకున్న అందాల సుందరి. చాలా చిన్న వయసులోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను తెచ్చుకున్న అజంతా శిల్పం. చక్కని కనుముక్కుతీరు .. మంత్రముగ్ధులను చేసే మందహాసం .. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకున్న వెన్నెల జలపాతం. ఆమె తొలి సినిమా 'ఉప్పెన' చూసిన వాళ్లంతా, ఈ మధ్య కాలంలో ఇంతటి అందాన్ని చూడలేదే అనే అనుకున్నారు.
చాలా కాలంగా సరైన యంగ్ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్న యంగ్ హీరోలంతా, ఇలాంటి బ్యూటీ కదా తమ సినిమాలలో ఉండాలని అనుకున్నారు. ఫలితంగా కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. నటన విషయంలోను .. డాన్సులలోను ఢోకా లేదనిపించుకున్న కృతి, తనదైన స్పీడ్ చూపించింది. టాప్ హీరోయిన్ కావడానికి ఈ అమ్మాయికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ అప్పటి నుంచే ఆమెకి పరాజయాలు ఎదురవుతూ రావడం మొదలైంది.
టాలీవుడ్ లో పరాజయాల ప్రభావం ముందుగా పడేది హీరోయిన్ పై మాత్రమే. ఫైట్లతో అలసిపోయిన హీరోలకి పాటలతో ఉపశమనం కలిగించే హీరోయిన్స్, తరతరాలుగా ఈ తలనొప్పి నుంచి బయటపడలేక పోతున్నారు. అలాగే వరుస ఫ్లాపులు కృతిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాంతో తెలుగు నుంచి ఆమెకి అకస్మాత్తుగా అవకాశాలు తగ్గిపోయాయి. బుట్టబొమ్మలాంటి ఈ బ్యూటీని పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళ .. మలయాళ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. వెన్నెల్లో వెన్నముద్దలాంటి ఈ బ్యూటీ మళ్లీ ఇక్కడి తెరపైకి రావాలనే అభిమానులు కోరుకుంటున్నారు.