Narendra Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Modi inaugurates new look Charlapalli railway station

  • ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
  • కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న ప్రధాని మోదీ
  • ఈ టెర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్‌లపై ఒత్తిడి తగ్గుతుందన్న ప్రధాని

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

రూ.413 కోట్లతో అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్‌ను గత ఏడాది డిసెంబర్ 28న ప్రారంభించాల్సి ఉంది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా వాయిదా పడింది.

టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మెట్రో నెట్ వర్క్ వెయ్యి కిలోమీటర్లకు పైగా విస్తరించినట్లు చెప్పారు. తెలంగాణ, జమ్ము కశ్మీర్, ఒడిశాలలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయన్నారు.

చర్లపల్లి టెర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపు సంతరించుకుందన్నారు. రైల్వేల ఆధునికీకరణ దేశం ముఖచిత్రాన్ని మార్చిందని వ్యాఖ్యానించారు.

ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నామన్నారు. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. వందే భారత్ రైళ్లలో స్లీపర్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News